మా తిరప్తి కథలు : రేపాకుల సుబ్బమ్మ తోట

సూచన : ఈ కథ నిజంగా జరిగిన ఒక సంఘటన ఆధారంగా వ్రాసినదే అయినా ఇందులో కొన్ని విషయాలు కాల్పనికం. ఒక మంచి విషయం చుట్టూ చెప్పుకుని ఓక కథలో కొన్ని కల్పితాలు ఉండడంలో తప్పు లేదనుకుంటాను.

నివాసముండేది హైద్రాబాద్లో అయినా తిరుపతికి తరచూ వెళ్ళివస్తూండేవాడిని. ఒకసారి తిరుపతికి వెళ్ళిన సందర్భంలో మా నాన్నగారితో కలసి సాయంవాహ్యాళి కి (ఈవెనింగ్ వాక్) బయలుదేరాను. మా ఇంటినుంచి కొద్దీ దూరం వెళ్లిన తరువాత ఒక కూడలిని దాటి ముందుకి సాగిపోతున్నప్పుడు ఒక దృశ్యం నా కంటపడింది. ఒక దేవుని ఊరేగింపు , రాములవారు అనుకుంట , అటుగా వెళ్ళింది. తిరుపతి లాంటి ఊరిలో అటువంటి ఊరేగింపులు సర్వసాధారణం, కానీ , నా సందేహం , రాములు వారి గుడి అక్కడికి చాలా దూరం, అంతేకాకుండా ఊరేగింపు వెళుతున్న దారిలో నాకు తెలిసి ఏ గుళ్ళు లేవు. నాకు తెలిసి ఉత్సవ విగ్రహాలని మాడ వీధులు దాటి తీసుకు వెళ్లారు. ఇంకేముంది వెంటనే మా నాన్నారిని అడిగేసాను.

కొన్ని ఏళ్ళ క్రితం ఆ ప్రాంతమంతా తోటలు ఉండేవి. ఆ తోటలన్నీ ఆ ప్రాంతములో నివసించే ఒకరికి చెందినవి. ఆవిడ పేరు రేపాకుల సుబ్బమ్మ. భర్తనుపోగొట్టుకున్న సుబ్బమ్మ ఆ తోట సహాయంతో తన పిల్లలని పెంచుకుంటూ ఉండేది. అప్పటికి తిరుపతి చాల చిన్న వూరు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆ ప్రాంతం లో ఒక ఉచిత స్కూల్ పెట్టాలని అనుకున్నారు. కానీ వారికి దగ్గరిలో ఎక్కడ స్థలం దొరక లేదు. టి టి డి వారికి సుబ్బమ్మ తోట ఒక్కటే అనువైన స్థలముగా అనిపించింది. టి టి డి వారు సుబ్బమ్మను సంప్రదించారు, తోటను అమ్మమని అడిగారు. ఇప్పట్లో కోట్ల విలువ చేసే ఆ స్థలం అప్పట్లో తక్కువేమి ఉండేది కాదు. అయినా టి టి డి అనుకుంటే ఎంత డబ్బైనా ఇచ్చి కొనగలరు. టి టి డి వారిని ఆశ్చర్యపరుస్తూ సుబ్బమ్మ డబ్బువద్దంటూ ఒక విచిత్రమైన కోరిక కోరింది.

ఆమె కోరిక ఏమిటంటే , శ్రీ రామ నవమి కి పది రోజుల తరువాత సీత సమేత శ్రీరాముల వారు తన ఇంటికి రావాలి, అక్కడ కల్యాణోత్సవం జరిగిన తరువాత తిరిగి గుడికి వెళ్ళాలి. ఈ విచిత్రమైన కోరికతో కొంత ఆశ్చర్య పోయినా టి టి డి వారు చివరకు అంగీకరించారు. ఇన్నేళ్ళ తరువాత కూడా ఇంకా రాములవారు ఉరేగింపుగా సుబ్బమ్మ గారి ఇంటికి వచ్చి కళ్యాణం తరువాత తిరిగి వెళ్ళుతున్నారు. ఇప్పటికి సుబ్బమ్మగారి కుటుంబమంతా ఆ రోజు రాములవారిని ఆహ్వానించి , వారి సన్నిధిలో గడిపి తిరికి సాగనంపుతారు. అతి సాధారణమైన సుబ్బమ్మగారు అసాధారణమైన నిర్ణయం తో రాములవారి సాక్షిగా తన పిల్లలకి వారి పిల్లలకి, వారు మరచిపోనివిధముగా కుటుంబ బాంధవ్యాల పై పాఠం చెప్పారు. ఒక వేళ వారు మరచిపోయినా రాములవారు వారిని మరువనివ్వరు. ఇంతకీ ఆ ప్రాంతం పేరేంటో చెప్పలేదు కదూ, అదే ఈ రోజు మనం పిలిచే R S Gardens (రేపాకులా సుబ్బమ్మ తోట). ఇప్పటికీ అక్కడ టి టి డి వారి బాలమందిర్ స్కూల్ వుంది.

నా పరిచయం : పుట్టి పెరిగింది తిరుపతిలో అయినా చదువురీత్యా తరువాత ఉద్యోగరీత్యా బయట దేశాలలో గడిపి ఇప్పుడు హైదరాబాద్ లో నివాసముంటున్నాను. కథలు చెప్పడమన్న , చదవడమన్న చాల ఇష్టం, ముఖ్యంగా తెలుగులో .
తెలుగు సాహిత్యంతో పెద్దగా పరిచయం లేకపోయినా , భాష చదివినప్పుడు , విన్నప్పుడు ఎంత బాగుందో చెప్పగలిగినంత ప్రావిణ్యం వుంది. ఇదంతా కూడా మా నాన్నగారి చలువే.